: రవి హత్య గురించి మాట్లాడుతున్నారు... రంగా హత్య దగ్గర్నుంచి చర్చిద్దాం సిద్ధమేనా?: వైకాపా
ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారాలని పోలీసులే చెప్పే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై చర్చిద్దామంటే... భయపడి, తమపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్పీకర్ నియోజకవర్గంలోనే మైనార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ మీడియా లాబీలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది మంచి పరిపాలన కోసమేగాని... హత్యా రాజకీయాలు, గూండాయిజం చేయడానికి కాదని అన్నారు. పరిటాల రవి హత్య గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు... వంగవీటి రంగా హత్య దగ్గరనుంచి చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.