: ధోనీది పాతపాటే!
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్టులో రెండో టెస్టు గెలిచిన జట్టు... సిరీస్ లో చివరి టెస్టు ఓడిన జట్టు ఒకటే! ఏమిటింత మార్పు..? సిరీస్ గెలుస్తారనుకుంటే వరుసగా మూడు టెస్టులు కోల్పోయారు. కనీసం ఆఖరి పోరాటంలోనైనా నెగ్గి సిరీస్ ను సమం చేస్తారనుకుంటే పరువు తీశారు. ఈ పరాజయపర్వంపై కెప్టెన్ ధోనీ తన అమూల్య అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఎప్పట్లానే, బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమి తప్పలేదని సూత్రీకరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓవల్ లో మీడియాతో మాట్లాడుతూ, "చివరి మూడు టెస్టుల్లో అంచనాలను అందుకోలేకపోయాం. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాం. ఆత్మవిశ్వాస లేమి రెండో ఇన్నింగ్స్ లో ప్రస్ఫుటమైంది. టాపార్డర్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, లోయరార్డర్ ఆదుకోవాల్సి వచ్చింది. ఏ దశలోనూ ఇంగ్లండ్ జోరును అడ్డుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయాను. కుర్రాళ్ళు ఈ సిరీస్ ద్వారా అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నాడు. కాగా, ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన ధోనీ రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ కావడం క్రికెట్ వైచిత్రి.