: ఆ మూడు అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది: కేసీఆర్
గవర్నర్ సమక్షంలో చంద్రబాబుతో జరిగిన సమావేశ వివరాల గురించి హైదరాబాదులోని క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించామని ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. పరస్పర ఒప్పందం కుదిరితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ ఎందుకన్న అంశంపై సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు. మనలో మనమే పరిష్కరించుకుందామనే నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నారు. మూడు అంశాల పైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. అసెంబ్లీ భవనాలు, ఉమ్మడి సంస్థలు, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ భవనాలపై సమస్య తొలగిపోయిందని ఆయన చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని కేసీఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలని అనుకున్నామని ఆయన అన్నారు. తెలుగువారి సమస్యలపై అవసరమైతే ఢిల్లీకి కలిసి వెళ్లి, కొట్లాడుతామని ఆయన చెప్పారు.