: పాల దొంగలు...ఈ పోలీసులు!
పోలీసులేంటీ, పాల దొంగలేంటీ అనే కదా మీ సందేహం. వాస్తవానికి పాల ప్యాకెట్లను చోరీ చేసిన ఆ ఇద్దరు యువకులు పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు మరి. పోలీసులై ఉండి దొంగలను పట్టుకోవాల్సింది పోయి ఇదేం పాడు బుద్ది అనేగా మీ సంశయం. కోట్లాది రూపాయల మేర విలువ చేసే పాలనేమీ వీరు కాజేయలేదులెండి, ఏదో చిల్లర దొంగల్లాగా... రోజుకు సరిపడా పాలను మాత్రమే తస్కరించారు. నిత్యం జరుగుతున్న ఈ తంతుపై పాలవ్యాపారి ఏకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పక్కా ఆధారాలతో మరీ ఆ చోర పోలీసులను కటకటాల వెనక్కి నెట్టేశాడు. గోవాలో ఓ వారం క్రితం చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర గోవాలోని పెర్నెమ్ పోలీస్ స్టేషనులో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జల్మీ, నీలేశ్ కర్మాల్కర్ లు రోజూ ఓ పాల వ్యాపారికి చెందిన దుకాణం నుంచి రూ.42 విలువ చేసే పాలను తస్కరిస్తూ వస్తున్నారు. విషయం గమనించిన పాల వ్యాపారి, ఎలాగైనా వీరి ఆటను కట్టించాలని తీర్మానించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పోలీసుల మాదిరిగానే ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇంకేముంది, ఆ రోజు యథావిథిగా పాలను తస్కరిస్తున్న చోర కానిస్టేబుళ్లు, సీసీ కెమెరాకు చిక్కారు. దీనిని పోలీసు ఉన్నతాధికారుల ముందు పెట్టడంతో కానిస్టేబుళ్లు ఇద్దరు అరెస్టయ్యారు. రూ.20 వేల విలువ చేసే ప్యాకెట్లను కానిస్టేబుళ్లు కాజేశారని పాల వ్యాపారి ఫిర్యాదు చేశాడు.