: పోలీసుల వైఫల్యంతోనే సహరాన్ పూర్ అల్లర్లు!
ఉత్తరప్రదేశ్ లో సహరాన్ పూర్ అల్లర్లు పోలీసుల వైఫల్యం కారణంగానే చోటుచేసుకున్నాయని వెల్లడైంది. ఈ మేరకు ఈ ఘటనలకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నియమించిన దర్యాప్తు కమిటీ తేల్చి చెప్పింది. సదరు నివేదికను యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు సమర్పించింది. బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్ చర్యల కారణంగానే ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయని చెప్పిన నివేదిక, అల్లర్లను మొగ్గలోనే అణచివేయడంలో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు స్థానిక పోలీసులు కూడా విఫలమయ్యారని నిగ్గు తేల్చింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే, ఈ గొడవల్లో ముగ్గురు వ్యక్తులు మరణించి ఉండేవారే కాదని కూడా ఆ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. అయితే ఈ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే బాధ్యులైన వారిపై చర్యలు తీసుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.