: మాల్యా... ఉద్దేశపూర్వక ఎగవేతదారే: ప్రకటనకు బ్యాంకుల సన్నాహాలు
లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సన్నాహాలు ముమ్మరం చేశాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం నుంచి మాల్యా రూ. 7 వేల కోట్లు అప్పుగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రుణం తీసుకున్న మాల్యా, కింగ్ ఫిషర్ నష్టాల బాట పట్టడంతో వాయిదాల చెల్లింపుల్లో విఫలమయ్యారు. ఇదే క్రమంలో మాల్యా ఆర్థిక స్థితిగతులు తెలిసి కూడా ఆయనకు భారీ రుణాలు ఎలా మంజూరు చేశారన్న విషయంపై దర్యాప్తు సంస్థలు బ్యాంకులను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సదరు బ్యాంకులు మాల్యాపై చర్యలకు ఉపక్రమించక తప్పలేదు. ఈ క్రమంలో ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాల్యాపై ఎగవేతదారు ముద్ర వేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగగా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సన్నాహాలను దాదాపు పూర్తి చేసింది. తాజాగా ఐడీబీఐ కూడా తన చర్యలను ముమ్మరం చేసింది. అయితే మాల్యాకు రూ 100 కోట్ల రుణమిచ్చేందుకే వెనుకాడిన ఐడీబీఐ, ఆ తర్వాత ఏకంగా రూ. 750 కోట్ల మేర భారీ రుణాన్ని ఎలా మంజూరు చేసిందని సీబీఐ ప్రశ్నించడంతో కాస్త ఆలస్యంగా ఆ బ్యాంకు ఈ చర్యలకు దిగడం విశేషం. ఈ వ్యవహారంలో ఐడీబీఐ ఉన్నతాధికారులు మాల్యాతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.