: జడ్జీకే ‘లవ్’ లెటర్లు రాశారట!
దేశంలో చోటుచేసుకున్న అవినీతి భాగోతాల్లో సంచలనం కలిగించిన కేసు సిండికేట్ స్కాం. తొలుత రూ. 50 లక్షల ముడుపులేనన్న ఈ కేసులో తదనంతరం రూ. 8 వేల కోట్ల మేర చేతులు మారినట్లు రూమర్లు వినిపించాయి. దీనిపై ప్రస్తుతం సీబీఐ అధికారులు కూపీలు లాగే పనిలో పడ్డారు. అయితే ఈ కేసులో హఠాత్తుగా దిగ్భ్రాంతి కలిగించే అంశం వెలుగు చూసింది. కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు చేయని యత్నం లేదట. ఈ విషయాన్ని ఏ న్యాయవాదో, సీబీఐ అధికారో చెప్పారనుకోకండి. నిందితులు ఎవరికైతే లేఖలు రాశారో, వారే, ఆ మహిళా న్యాయమూర్తే వెల్లడించారు. ఎక్కడనుకుంటున్నారు, ఓపెన్ కోర్టులో. ‘ మీ క్లెయింట్లకు కాస్త తిక్క ముదిరినట్టుంది. పద్దతిగా ఉండమని చెప్పండి. లేదంటే దీనిపైనా సీబీఐతో విచారణ చేయించడంతో పాటు వాతలు కూడా పెట్టించాల్సి వస్తుంది’ అంటూ సిండికేట్ స్కాం కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తి స్వరణ కాంత శర్మ, నిందితుల తరఫు న్యాయవాదిని హెచ్చరించారు. ‘నాకు రాస్తున్న ప్రేమ లేఖలను నిలిపేయమని చెప్పండి. నాది బాగా స్థిరపడ్డ కుటుంబమే. ఈ తరహా కుయుక్తులు మానకపోతే, సీబీఐని రంగంలోకి దింపాల్సి వస్తుంది’అంటూ శర్మ నిందితుల తరఫు న్యాయవాదికి తేల్చిచెప్పారు. ప్రేమ లేఖలంటే, అదే ఆమెను తమకు అనుకూలంగా మలచుకునేందుకు చేసిన ప్రతిపాదనలన్నమాట. మీరు మాకు అనుకూలంగా వ్యవహరిస్తే, ఫలానా పద్దతిలో ఫలానా బహుమానాలు ముట్టజెపుతామంటూ నిందితులు పదే, పదే ఆ జడ్జీకి లేఖలు రాశారట. దీంతో విసుగెత్తిపోయిన సదరు న్యాయమూర్తి ఇలా తన చతురతతో వారికి కళ్లెం వేశారు. మరి ఇప్పటికైనా బొక్కిందంతా కక్కి, తప్పు ఒప్పుకుంటారో, లేదా ఇంకా పైత్యం చూపి మరింత చిక్కుల్లో ఇరుక్కుంటారో వారికే వదిలేస్తున్నట్లు శర్మ చెప్పకనే చెప్పారు.