: యూపీ అభివృద్ధికీ పూర్తి మద్దతు: రాజ్ నాథ్ సింగ్
దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం ముందుకు సాగనుందని ఆయన శనివారం వెల్లడించారు. యూపీ అభివృద్ధి విషయంలో అఖిలేశ్ ప్రభుత్వానికీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, "ప్రధాని ప్రసంగానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ముందుగా రూపొందించుకున్న ప్రసంగ పాఠాన్ని చదవడమనే సంప్రదాయాన్ని విడనాడి, తన మనసులో ఏముందన్న దానిని ప్రజల ముంగిట పెట్టారు" అని చెప్పారు. కొద్ది నెలల్లోనే తమ ప్రభుత్వ పనితీరు బయటపడనుందని చెప్పిన రాజ్ నాథ్, దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా తమ పాలన సాగుతుందన్నారు. ఆర్థిక రంగానికి జవజీవాలు నింపే దిశగా వేగవంతమైన చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.