: సింగరాయకొండలో ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు పోలీసులకు చిక్కాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ప్రేయసిని చంపేసి, ఆమె మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో ఆ దుర్మార్గుడు పోలీసులకు దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టణంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వాహనాన్ని ఆపారు. ఆ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఓ యువతి మృతదేహం కనిపించింది. డ్రైవర్ స్థానంలో ఉన్న యువకుడిని ప్రశ్నించగా, అతడు పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు విషయం వెలుగు చూసింది. నేరాన్ని ఒప్పుకున్న అతడిని వాహనం సహా స్టేషన్ కు తరలించిన పోలీసులు, అసలు విషయాన్ని రాబట్టే పనిలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.