: రెండేళ్లుండగానే... యూపీ భావి సీఎంపై బీజేపీలో రసపట్టు
దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కీలకంగా పరిణమిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. అయితే అప్పుడే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఫలానా నేత సీఎం బరిలో దిగనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీని అభిమానించే పలువురు నెటిజన్లు ఈ ప్రచారంపై బాగా స్పందిస్తున్నారు. ఫలానా వ్యక్తి, బీజేపీ సీఎంగా బరిలో నిలవడమే కాక, తప్పనిసరిగా విజయం సాధిస్తారని కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికలో యూపీలో ఊహించని రీతిలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ కొల్లగొట్టడంతో ఉత్సాహంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా ప్రచారానికి తెర తీశారు. దీనికి నెటిజన్ల అభిమానం కూడా తోడవడంతో ప్రచారం తార స్థాయికి చేరుకుంది. యూపీ భావి సీఎం బరిలోని బీజేపీ నేతల్లో గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయన ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. వ్యక్తిగత ప్రచారానికి తాను వ్యతిరేకినని చెప్పిన ఆయన, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మాత్రం గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక రేసులో మరో యువ నేత వరుణ్ గాంధీ కూడా దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని ఫిలిబిత్ ఎంపీ, కేంద్ర మంత్రి మేనకాగాంధీ, తన తనయుడు వరుణ్ ను కాబోయే యూపీ సీఎంగా ఇప్పటికే ప్రకటించేశారు. ఇక పార్టీని గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయ బాటలో నడిపించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ కూడా ఈ రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ జాబితాలో పేరు చోటుచేసుకున్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పాయ్, ఈ ఊహాజనిత ప్రచారంపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సృష్టించిన వారిని కనుగొని, వారిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ జాతీయ నేతలు కూడా ఈ ప్రచారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఊహాగానాల గురించి అసలు తమకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం ఇప్పట్లో ఆగేలా లేదు.