: ఇల్లు మారారా?... అయితే, ఆర్టీఏకు తెలపాల్సిందే...లేకుంటే జరిమానాయే!
ఇల్లు మారారా? ఆర్టీఏకు తెలియజేయాల్సిందే. జరిమానా బారిన పడాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రవాణాశాఖ నుంచి గతంలో సేకరించిన చిరునామాలే పోలీసుల వద్ద ఉన్నాయి. దీంతో ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ చిరునామాను ఆరాతీస్తే అక్కడ వాహన యజమానులు ఉండడం లేదు. ఈ-చలానాలు పంపినా రిజెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని పోలీసులు, రవాణాశాఖ దృష్టికి తీసుకువచ్చారు. దీనిని నివారించేందుకు ఆర్టీఏ చట్టంలో మార్పులు తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ చట్టం ప్రకారం వాహనదారులు ఇల్లుమారితే 30 రోజుల్లోగా కొత్త చిరునామాను ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాలి. లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు రవాణాశాఖ భారీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం వాహన ఇన్స్యూరెన్స్ రెన్యూవల్ చేసుకునేప్పుడు, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలోని అడ్రెస్ ను వాహనదారులు పేర్కొంటున్నారు. అలా కాకుండా ఇకపై ఇంటి చిరునామాను అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు, నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసు- రవాణాశాఖలు సంయుక్తంగా వ్యవహరించి, రిజిస్టర్ అయ్యే ప్రతి వాహనం వివరాలు నేరుగా పోలీసు డేటా సర్వర్‌లో నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. వాహనం తయారీ కంపెనీ పేరు, రంగు, ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నంబర్లు, యజమాని పేరు, చిరునామా సహా వాహనం, యజమాని వివరాలు పోలీసు రికార్డుల్లోకి చేరనున్నాయి. ఇది ఓ నెల రోజుల్లో కార్యరూపం దాల్చనుందని సమాచారం.