: ఎన్ కౌంటర్ మృతుడి లైఫ్ స్టైల్ చూసి షాక్ తిన్న పోలీసులు


ఘరానా చెయిన్ స్నాచర్ శివ హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్ వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన శివపై 250కి పైగా గొలుసు దొంగతనాల కేసులు ఉన్నాయి. కాగా, నార్సింగ్ లో శివ నివసిస్తున్న ఇంటిని పరిశీలించిన పోలీసులు నోళ్ళు వెళ్ళబెట్టారు. లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్, ఖరీదైన ఫర్నిచర్ చూసి ఔరా అనుకున్నారు. ప్లాస్మా టీవీ, ఆక్వేరియం కూడా పోలీసులను ఆశ్చర్యపరిచాయి. తాము వచ్చింది ఓ దొంగ ఇంటికేనా..! అని పోలీసులకే సందేహం వచ్చిందంటే శివ జీవనశైలి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. స్నాచింగ్ కు పాల్పడే శివ ఒంటరి మహిళలను టార్గెట్ చేసేవాడు. చిరునామా అడుగుతున్నట్టు నటించి లాఘవంగా వారి మెడలో నగలు లాక్కెళ్ళేవాడు. ఆ బంగారు ఆభరణాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో కుటుంబంతో కలిసి పరాయి రాష్ట్రాలకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకని మూణ్ణెల్లకోసారి ఇల్లు మార్చేవాడట. కాగా, ఎన్ కౌంటర్ నేపథ్యంలో శివ భార్యతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందోసారి శివ పోలీసులకు టోకరా ఇచ్చి తప్పించుకున్నాడు. రెండ్రోజుల క్రితం కూడా ఓ కానిస్టేబుల్ పై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీంతో, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఉనికిని గుర్తించారు.

  • Loading...

More Telugu News