: అక్కడ బుల్లెట్ మోటార్ సైకిల్ కు పూజలు చేస్తారు!


దేవుళ్ళకు గుడులు కట్టారంటే ఆశ్చర్యపోవాల్సిందేమీలేదు. సినిమా తారలకు ఆలయాలు నిర్మించడం కూడా చూశాం. కానీ, ఓ బుల్లెట్ మోటార్ సైకిల్ కు గుడి కట్టారన్న విషయం తెలుసా? మనం ఆ బుల్లెట్ బాబా టెంపుల్ ను కళ్ళారా చూడాలంటే రాజస్థాన్ వెళ్ళాల్సిందే. పాలి జిల్లాలో జోథ్ పూర్ సిటీకి సమీపంలోని చోటియా గ్రామం వద్ద ఈ గుడి ఉంటుంది. ఓం బన్నా క్షేత్రంగా ఇది ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పూజలందుకోవడం విశేషం. స్థలపురాణం చెప్పుకోవాలంటే.... ఓం బన్నాగా ప్రసిద్ధుడైన ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి 1988లో ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బంగ్డి పట్టణం నుంచి చోటియా వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొన్నది. ఓం భన్నా అక్కడిక్కడే మరణించగా, బుల్లెట్ పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్ళి బుల్లెట్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్ నుంచి బుల్లెట్ మాయమై తిరిగి సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షమైంది. మళ్ళీ దాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చిన పోలీసులు ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంధన ట్యాంకులోంచి ఆయిల్ తీసివేసి, చైన్లతో దాన్ని కట్టేశారు. అందరినీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తూ మోటార్ సైకిల్ తిరిగి సంఘటన స్థలంలోని చెట్టు వద్దకే చేరింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో దాన్నో మహిమాన్విత మోటార్ సైకిల్ గా భావించిన స్థానికులు పూజలు చేయడం ఆరంభించారు. అక్కడే ఓ గుడి కూడా కట్టి 'బుల్లెట్ బాబా' ఆలయం అని పేరు పెట్టారు. ప్రయాణికులను ఓం బన్నా ఆత్మ కాపాడుతుందనేది అక్కడి వారి నమ్మకం. అక్కడ ఉండే ఓ చెట్టుకు గాజులు, తాళ్ళు వంటి వస్తువులను సమర్పించుకోవడం ఆచారంగా వస్తోంది.

  • Loading...

More Telugu News