: భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కనీసం ఇషాంత్ శర్మలా కూడా ఆడలేకపోతున్నారు
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కు ఏమయ్యిందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఒక్క మురళీ విజయ్ ను మినహాయిస్తే... మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ స్కోరు 0,4,6,0. కనీసం పదో నెంబర్ లో దిగే ఇషాంత్ శర్మలా కూడా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఆడలేకపోతున్నారు. పెద్దగా బ్యాటింగ్ రాని ఇషాంత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో 42 బంతుల్ని కాచుకుని నాటౌట్ గా నిలిచాడు. ధోనికి 16 ఓవర్లకు పైగా సహకారమందించాడు. ఇషాంత్ శర్మలా కనీసం ఒకరిద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించినా భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయ్యేది కాదు. ఓ పక్క ధోని బ్యాటింగ్ చూస్తుంటే... పిచ్ అంత ప్రమాదకంగా లేదని... ఇంగ్లండ్ బౌలర్లు మరీ అంత భీకరంగా బౌలింగ్ వేయడం లేదని అర్థమవుతోంది. కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కు మాత్రం ఈ విషయం అస్సలు అర్థం కావడం లేదు. వాళ్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు గమనిస్తే... బంతి బంతికీ గండమే అన్నట్లు కనిపించింది. ఏ ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో... సరైన టెక్నిక్ తో బంతులను ఎదుర్కోలేదు. కనీసం ఇషాంత్ శర్మకు ఉన్న డిఫెన్స్ టెక్నిక్ కూడా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.