: మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం: గవర్నర్ కు హామీ ఇచ్చిన కేసీఆర్, చంద్రబాబు
ఇప్పటివరకు ఎడమొహం, పెడమొహంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఇకపై కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి అంగీకారం తెలిపారు. గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వంతో... వీరిరువురు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సమస్యలపై చర్చించుకోవడానికి అంగీకారం తెలిపారు. నిన్న ఆగస్ట్ 15 సందర్భంగా గవర్నర్ 'ఎట్ హోం పార్టీ'ని రాజ్ భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీ పూర్తయిన తర్వాత ఆయన చంద్రబాబు, కేసీఆర్ లను ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడారు. నిన్నటివరకు కలిసి ఉన్న రాష్ట్రం విడిపోయిందని, విభజన కారణంగా అనేక సమస్యలు రావడం సహజమని... అపార అనుభవమున్న మీరిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ఈ సమావేశంలో సూచించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు, కేసీఆర్ లు రెండు కళ్ల లాంటి వారిని... ప్రతీ చిన్న సమస్యను పరిష్కరించుకోకుండా... కోర్టులకో, కేంద్రం దగ్గరికో వెళ్లడం మంచిది కాదని నరసింహన్ హితవు పలికారు. చిన్న సమస్యలను ఇరువురు కూర్చుని పరిష్కరించుకుంటే... విభజన కారణంగా వచ్చిన సంక్లిష్టమైన సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నరసింహన్ చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు ముందుగా సానుకూలత వ్యక్తం చేశారు. కేసీఆర్ తో కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి తనకెలాంటి పట్టింపులు లేవని... ఇప్పటికే కూర్చుని మాట్లాడుకుందామని కేసీఆర్ కు లేఖ కూడా రాశానని ఆయన గుర్తుచేశారు. కలిసి చర్చించుకుని సమస్యలను తీర్చుకుంటే తెలుగువారి గౌరవం కూడా పెరుగుతుందని అని ఆయన అన్నారు. చంద్రబాబు తన అభిప్రాయం చెప్పిన తర్వాత కేసీఆర్ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు తనకు కొత్తేమి కాదని... చర్చలకు తాను కూడా వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. విభజనను కేంద్రం గందరగోళంగా చేయబట్టే... ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తమకు ఏ విషయంలోను సంతోషం లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మళ్లీ ప్రతిస్పందించారు. విభజన సరిగ్గా జరగలేదని తాను మొదటి నుంచి అంటున్నానని ఆయన గుర్తుచేశారు. మంచో, చెడో విభజన జరిగిపోయిందని... ఇకపై తెలుగువారందరూ బాగుపడాలని కోరుకుందామని ఆయన కేసీఆర్ కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కు ఓ ప్రతిపాదన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఉన్న చోట ఏపీ సహకరిస్తుందని... అలాగే ఆంధ్రప్రదేశ్ కు ఇబ్బంది ఉన్న చోట తెలంగాణ సహకరించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కేసీఆర్ కూడా సమ్మతించారు... ముందు అధికారుల స్థాయిలో సమస్యాత్మక అంశాలను గుర్తించి... ఆ తర్వాత తామిరువురు కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి 'ఇరువురు చంద్రులు' వచ్చారు. అతి త్వరలో చంద్రబాబు, కేసీఆర్ ల భేటీ జరగాలన్నది తన ఆకాంక్ష అని గవర్నర్ ఆఖరులో అనడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు నవ్వేశారని సమాచారం.