: కోటి మంది ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనున్న అమెరికా ఇమిగ్రేషన్ బిల్లు
అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఇమిగ్రేషన్ బిల్లు ఏకంగా దేశీయంగా కోటి మంది ఐటీ ప్రొఫెషనల్స్ పైనా, అమెరికాలో 50 లక్షల మంది నిపుణులపైనా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని ఇండియన్ అమెరికన్ అడ్వైజరీ కౌన్సిల్ (ఐఏఏసీ) ఛైర్మన్ శలభ్ కుమార్ తెలిపారు. ఈ బిల్లు పాస్ అయితే భారత ఎకానమీపై ప్రతి ఏటా రూ. 1.8 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లనుందని అభిప్రాయపడ్డారు. భారత ఐటీ రంగం అమెరికా పైనే ఎక్కువగా ఆధారపడిన సంగతి తెలిసిందే. అమెరికా ఇష్యూ చేసే హెచ్1బీ, ఎల్1 వీసాలను ఎక్కువగా పొందుతున్నది కూడా భారత నిపుణులు, కంపెనీలే. అమెరికన్ కంపెనీల్లో ఎక్కువగా పనిచేస్తున్నది భారత ఐటీ నిపుణులే. దీనికి తోడు ఔట్ సోర్సింగ్ ద్వారా ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నది కూడా భారత్ కే. దీంతో, తమ ఉద్యోగాలను భారత్ తన్నుకుపోతోందని అమెరికన్లలో బలమైన అభిప్రాయం పాతుకుపోయింది. ఈ క్రమంలో, వీసాల వినియోగంపై ఆంక్షలు విధించేలా రాజకీయ పార్టీలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కొత్త ఇమిగ్రేషన్ బిల్లును ప్రతిపాదిస్తున్నారు. నవంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్న నేపథ్యంలో, ఏ క్షణంలో అయినా అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే భారత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు కష్టాలు మొదలైనట్టే.