: ఇక చెమటతోనూ సెల్ ఫోన్ చార్జింగ్
చెమట పోస్తుంటే మనం ఎంతో చిరాకుగా ఫీలవుతాం. కానీ, కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఆ స్వేదం పట్ల ఇక ఎంతమాత్రం విసుగు ప్రదర్శించనవసరం లేదంటున్నారు. ఆ వ్యర్థ జలంతో వారు సెల్ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చని నిరూపించారు. ఎలాగంటే... ఓ టాటూ తరహాలో ఉన్న సెన్సర్ ను శరీరానికి అతుకుతారు. సదరు వ్యక్తి శ్రమిస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే స్వేదంలో ఉండే లాక్టేట్ కు ఏ సెన్సర్ స్పందిస్తుంది. తద్వారా ఎలక్ట్రాన్ల రూపంలో శక్తిని సెల్ ఫోన్ లో ఉండే బయో బ్యాటరీకి చేరవేస్తుంది. ఆ బ్యాటరీలో ఉండే ఆనోడ్ లాక్టేట్ నుంచి ఎలక్ట్రాన్లను తొలగించే ఎంజైమును కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీకి మరోవైపున ఉండే కాథోడ్ ఆ ఎలక్ట్రానులను గ్రహించేందుకు వీలుగా ఓ అణువును కలిగి ఉంటుంది. దీంతో, ఎలక్ట్రాన్ల ప్రవాహం అటు నుంచి ఇటు సాఫీగా సాగుతుంది. ఈ ప్రక్రియతో శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ వినూత్న చార్జింగ్ విధానం మార్కెట్లోకి వస్తే ఇక కరెంటు కోతలపై చింతించాల్సిన పని ఉండదేమో!