: టీవీ 9 ప్రమోటర్ల వాటాలు అమ్మకానికి సిద్ధం!


ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ టీవీ9లో ప్రమోటర్ల వాటాలు విక్రయించనున్నారా? దానికి సంబంధించిన ప్రక్రియ తుది అంకానికి చేరుకుందా? అంటే టీవీ9 వ్యవస్థాపక ప్రమోటర్లలో ఒకరైన శ్రీనిరాజు అవుననే అంటున్నారు. వాటాల విక్రయంపై వచ్చే నెల చివరికి స్పష్టత రానుందని ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీవీ9లో తమ వాటాను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయని అన్నారు. పలు ప్రాంతీయభాషల్లో వార్తలందిస్తున్న టీవీ9 న్యూస్ చానల్స్‌ మాతృ సంస్థ అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ(ఏబీసీ)లో శ్రీనిరాజుకు 60 శాతం వాటా ఉంది. తమకు సంబంధించిన వాటాల విక్రయ వ్యవహారాలు చూసేందుకు రెండేళ్ల క్రితమే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ని నియమించామని ఆయన చెప్పారు. అయితే, ఆర్థిక మందగమనం వల్ల వాటాల విక్రయాన్ని పూర్తి చేయలేకపోయామన్నారు. వాటాలు కొనడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల పేర్లు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఏబీసీ కంపెనీ విలువ మదింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, దీనిపై స్పష్టత వచ్చిన తరువాత విక్రయం పూర్తయ్యే అవకాశం ఉందని రాజు వివరించారు. టీవీ9 చానల్‌ను తెలంగాణ రాష్ట్రంలో ప్రసారం కాకుండా ఎంఎస్‌వోలు అడ్డుకోవడంతో టీవీ9 క్యాపిటల్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మార్కెట్ అంచనా ప్రకారం ఏడు ప్రాంతీయ చానల్స్‌ను కలిగి ఉన్న టీవీ9 విలువ 400 కోట్ల రూపాయలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం వాటాల విక్రయం మాత్రమేనని, ఒక ఇన్వెస్టర్ వైదొలగి అతని స్థానంలో మరో ఇన్వెస్టర్ రావడం తప్ప టీవీ9 ఉద్యోగుల్లో, యాజమాన్యంలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కాగా, టీవీ9 15శాతం వాటాను ఇదివరకే అమ్మేసింది. ఐల్యాబ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరుతో ఏబీసీ లిమిటెడ్‌లో తొలుత 100 శాతం వాటాలు కలిగిన శ్రీనిరాజు చానల్ ప్రారంభమైన తర్వాత సీఈవో సహా ఇతర సహోద్యోగులకు 20% ప్రమోటర్ల వాటాను కేటాయించగా, మరో 20% వాటాను కొద్ది సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ అనే సంస్థకు రూ. 51 కోట్లకు విక్రయించారు. తాజాగా మిగిలిన 60 శాతం వాటాను అమ్మకానికి పెడుతున్నట్టు ఆయన చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News