: వీళ్ళకూ 'భారతరత్న' ఇవ్వాలట!


భారతరత్న... మనదేశ అత్యున్నత పౌర పురస్కారం. తమ రంగాల్లో శిఖర సమానం అనదగ్గ కృషి సల్పితే తప్ప ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దరిచేరదు. కానీ, కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, "మాకెందుకివ్వరు భారతరత్న?" అని కేంద్రానికి లేఖలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా, కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన రామ కె పూజారి అనే వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ రాశారు. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో 'నేను చంద్రమండలంపైకి మూడు సార్లు యాత్ర చేపట్టాను. మరో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో ప్రయాణించాను. మొదటిసారిగా 1956లో చంద్రుడిపైకి వెళ్ళాను' అని పేర్కొన్నారు. అంతేగాకుండా, తాను స్పేస్ సూట్ ధరించి ఉన్న ఓ ఫొటోషాప్ ఇమేజిని కూడా లేఖకు జత చేశారు పూజారి. సాధారణ పౌరులు భారతరత్నను కోరుకోవడం ఇదే మొదటిసారి కాదండోయ్. ఇంతకుముందు మహారాష్ట్రలోని యవట్మల్ జిల్లాకు చెందిన ఆనంద్ రావ్ మల్హరే భోంగాలే అనే వ్యక్తి 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు డజనుకుపైగా లేఖలు రాశారట. ఇజ్రాయెల్, అరబ్ సమాజం నడుమ శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించానని, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు లేఖ రాశానని తన ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేగాకుండా, భారత్ లో మండల్ కమిషన్, జవహర్ నవోదయ విద్యాలయాల ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. ఇక, తమిళనాడుకు చెందిన ఎం.ప్రభాకరన్ ది మరో కథ. ఈయన తాను దేవుడి కుమారుణ్ణని, సూర్య పుత్రుణ్ణని, దైవదూతనని అభివర్ణించుకుంటూ, తనకూ భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇలాంటివే ఎన్నో..! హైదరాబాదుకు చెందిన దుబ్బుడు రాకేశ్ అనే సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దరఖాస్తు చేయగా, ప్రధానమంత్రి కార్యాలయం ఈ 'భారతరత్న' లేఖల వివరాలు అందించింది.

  • Loading...

More Telugu News