: మితిమీరి వాడితే 'ఉప్పు' కూడా విలనే!


"అన్నీ వేసి చూడు, చివర్లో నన్ను వేసి చూడు" అని ఉప్పు అంటుందట! ఓ వంటకంలో ఎన్ని దినుసులు వేసినా, దానికి ఉప్పు కలిపితేనే మంచి రుచి వస్తుందని దానర్థం. ఓ పరిమితికి లోబడి లవణాన్ని వాడితే ఓకే. మితిమీరితే మాత్రం అనర్థమే. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అదనంగా తీసుకున్న ఉప్పు కారణంగా 2010లో ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలమందికి పైగా మరణించారట. ఉప్పు అధిక మోతాదులో వాడడంతో వారందరూ గుండె సంబంధ సమస్యలకు గురై మృత్యువాత పడ్డారని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఈజేఎం)లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనాన్ని టఫ్ట్స్ యూనివర్శిటీకి చెందిన ఓ వంద మంది సభ్యుల బృందం చేపట్టింది. మొత్తం 187 దేశాలకు చెందిన ప్రజల ఆహార అలవాట్లను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. కాగా, సగటున రోజుకి ఓ వ్యక్తి తీసుకోవాల్సిన ఉప్పు పరిమాణం 3.95 గ్రాములు కాగా, భారత్ లో అది 7.6 గ్రాములుగా ఉందన్న విషయం ఆందోళన కలిగించకమానదు. దీనిపై విడిగా మరో అధ్యయనం చేపట్టిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ భారత్ లో ఉప్పు సగటు వినియోగం అధికమన్న సంగతి వెల్లడించింది. ఉప్పు గుండెపోటుకు, రక్తపోటు, పక్షవాతానికి కారణమవుతుందన్న సంగతి తెలిసిందేనని డాక్టర్ శశాంక్ జోషీ తెలిపారు.

  • Loading...

More Telugu News