: ఆంధ్రప్రదేశ్ కు ఓ 'సింగరేణి' దొరికింది... ఫుల్ హ్యాపీగా ఉన్న చంద్రబాబు


రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం చాలా నష్టపోయిందని... ప్రస్తుతం చాలా సంక్షోభంలో ఉన్నామని... చంద్రబాబు నాయుడు వీలున్నప్పుడల్లా తన ప్రసంగాల్లో బాధపడుతుంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన సుమారు రెండు నెలల తర్వాత... ఇటీవలే చంద్రబాబుకు అధికారుల నుండి ఓ శుభవార్త అందింది. ఏపీకి కూడా ఓ 'సింగరేణి' దొరికిందన్నదే ఆ శుభవార్త! పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న చింతలపూడి పరిసర ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) సీఎండీ శాలినీ మిశ్రా ఇటీవలే చంద్రబాబుకు తెలియజేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే... పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని చింతలపూడి గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో జి గ్రేడ్‌కు చెందిన నాణ్యమైన బొగ్గునిల్వలు భారీగా ఉన్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జిఎస్‌ఐ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందటంతో చంద్రబాబు గురువారం సంబంధిత ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో... పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో విస్తరించిన చింతలపూడి సబ్‌ బేసిన్‌లో ఉన్న గోండ్వానా బొగ్గు నిల్వల వివరాలను అధికారులు సిఎం ముందుంచారు. ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు క్షేత్రాలు ఉండటంపై చంద్రబాబు ఈ సమావేశంలో సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి ఉప బేసిన్‌ పరిధిలో రాచర్ల-నర్సాపురం, వడ్లగూడెం, సీతానగరం, నారాయణపురం-పట్టాయగూడెం, వూతసముద్రం- వెంకటాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, తడికలపూడి బ్లాకుల్లోనూ... కృష్ణా జిల్లాలోని సోమవరం బ్లాకులో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నట్లు జిఎస్‌ఐ గుర్తించిందని అధికారులు వివరించారు. కోల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇన్ స్టిట్యూట్‌ నిపుణులతో చర్చించి బొగ్గు వెలికితీతపై వెంటనే ప్రణాళికను రూపొందించాలని ఈ సమావేశంలో ఏపీఎండీసీ ఎండీ శాలినీ మిశ్రాను సిఎం ఆదేశించారు. మన దేశ విద్యుత్ అవసరాలలో సగం థర్మల్ విద్యుత్ కేంద్రాలే తీరుస్తున్నాయి. బొగ్గును ఉపయోగించుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేసే కేంద్రాలను థర్మల్ విద్యుత్ కేంద్రాలంటారు. పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలంటే పరిశ్రమలకు ఆటంకాలు లేని నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. ఎక్కడైనా కొత్త చోట పరిశ్రమలు స్థాపించాలనుకున్నప్పుడు పారిశ్రామిక వేత్తలు ప్రథమంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా ఉందనే విషయాన్ని ప్రధానంగా చూస్తారు. ఈ క్రమంలో చింతలపూడి బొగ్గుగనులు గనుక వినియోగంలోకి వస్తే... ఏపీ కూడా పారిశ్రామికాభివృద్ధిలో వేగంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News