: ఎబోలా ప్రభావం 10 లక్షల మందిపై పడింది
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారి ప్రభావం పశ్చిమ ఆఫ్రికాలోని 10 లక్షల మందిపై పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి వ్యాప్తిని ఆపడానికి అసాధారణ చర్యలు అవసరమని చెప్పింది. ఇప్పటికే ఇది పెను ఆరోగ్య సంక్షోభంగా మారిందని... త్వరలోనే మానవ సంక్షోభంగా మారుతుందని వెల్లడించింది. ఇప్పటి వరకు 1975 కేసులు నమోదవగా... 1069 మరణాలు సంభవించాయని తెలిపింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు సియెర్రాలియోన్, గినియా, లైబీరియా సరిహద్దుల్లోని హాట్ జోన్ లో ఉన్నారని ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రతి నగరానికీ ఎబోలా ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాస్ తెలిపారు. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి డబ్ల్యూహెచ్ఓ చేపడుతున్న చర్యలకు ఐరాస పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. మరోవైపు, ఎబోలా వ్యాధికి చికిత్సలు, టీకాలు తయారుచేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.