: ఒక్క క్లిక్ 200 మందిని చంపేసింది


మరణించిన వారిని బ్రతికున్న వారి జాబితాలో చేరిస్తే అవినీతికి పాల్పడ్డారని కేసులు పెడతారు. అదే బతికి ఉన్నవారిని మరణించిన వారిగా లెక్కగడితే ఉద్యోగులకు పనిష్మెంటిస్తారు, మరి సంస్థలే అలాంటి తప్పు చేస్తే, ఓ క్షమాపణతో సరిపెట్టేస్తారు. అదే లోకం అంటే...! ఇలాంటి తప్పులు మన గ్రామాల్లో చాలా చోటుచేకుంటాయి, అది సర్వ సాధారణం కూడా. అయితే ఇలాంటి సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకోవడంతో అదో పెద్ద విషయమై కూర్చుంది. ఆస్ట్రేలియాలోని ఆసుపత్రుల్లో పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యాక వారికి దానికి సంబంధించి నివేదికను ఇంటికి పంపుతారు. ఆ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన రోగులకు నివేదికలు పంపారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వారంతా బతికుండగానే చనిపోయినట్లు ఆ నివేదికలో గుర్తించారు. ఆస్ట్రేలియాలోని ఆస్టిన్ ఆసుపత్రి ఏకంగా 200 మంది రోగులకు మరణించినట్లు సర్టిఫికెట్లు ఇచ్చింది. దీంతో బతికున్న రోగులు అవాక్కయ్యారు. తాము బతికే ఉన్నామని ఆసుపత్రికి తెలిపారు. దీంతో అంత పెద్ద పొరపాటు ఎలా సంభవించిందా? అని ఆసుపత్రి యాజమాన్యం సరి చూసుకుంది. ఒక్క మౌస్ క్లిక్ తో ఇంత పెద్ద సమస్య ఏర్పడిందని ఆసుపత్రి తెలుసుకుంది. ఈ పొరపాటును ఆసుపత్రి యాజమాన్యం సరిచేసుకుందామని భావించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది ఒక మౌస్ క్లిక్ కారణంగానే అలా జరిగిందని, ఆ నోటిఫికేషన్ పూరించేటప్పుడు తప్పుగా క్లిక్ చేశాం. దాంతోనే ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చి, క్షమాపణలు కూడా తెలిపింది.

  • Loading...

More Telugu News