: ఉత్తరాఖండ్ గవర్నర్ పై వేటుకు రంగం సిద్ధం
దేవుడే దిగి వచ్చినా మహిళలపై అత్యాచారాలను అడ్డుకోలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషిపై వేటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఖురేషీ దీనిపై మాట్లాడుతూ ‘జూలై 30 తేదీలోగానే పదవి నుంచి తప్పుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు, అయితే, సదరు వ్యాఖ్యల్లో నా తప్పేమీ లేదని నిరూపించే వీడియో టేపును కేంద్రానికి సమర్పించాను’ అని చెప్పారు. 2012లో ఉత్తరాఖండ్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఖురేషి, ఇటీవలే ప్రధాని మోడీని కలిసి పదవీ కాలం ముగిసేదాకా తనను గవర్నర్ గా కొనసాగించాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనకు మోడీ సర్కారు సానుకూలంగా స్పందించిన దాఖలాలేవీ కనిపించలేదు. దీంతో ఖురేషీ గవర్నర్ గిరీ ఊడినట్టేనన్న వదంతులు వినిపిస్తున్నాయి.