: ఇకపై బ్యాంకుల అత్యున్నత పదవుల భర్తీపై ప్రభుత్వ నిఘా?


సిండికేట్ బ్యాంకు సీఎండీ జైన్ అరెస్ట్ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ రంగ బ్యాంకుల అత్యున్నత పదవుల భర్తీపై ప్రభుత్వం నిఘా పెట్టనుంది. అంతేకాక ఈ పదవుల భర్తీకి అవలంబిస్తున్న విధానాన్ని కూడా పునఃసమీక్షించాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథీకి కూడా ఆర్థిక మంత్రిత్వ కార్యాలయం ఓ లేఖ రాసిందని తెలిసింది. జైన్ అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నత స్థాయి పదవుల్లో జరుగుతున్న నియామకాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా నియామకాల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకు ఉద్యోగుల వార్షిక రహస్య నివేదికలను పక్కన పెట్టేసిన నియామకాల కమిటీ బ్యాంకుల ఉన్నత పదవుల భర్తీ చేపడుతున్న వైనంపై సీబీఐ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. జైన్ కు సంబంధించిన ఏసీఆర్ లు ఆశాజనకంగా లేనప్పటికీ ఆయన నియామకం జరిగిపోయిందని తెలిపింది. దీంతో దీనిపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఈ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు నియామకాలపై నిఘా వేయాలని కూడా తీర్మానించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ తరహా నియామకాలను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నేతృత్వంలోని కమిటీ చేపడుతోంది.

  • Loading...

More Telugu News