: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి రేసులో యశ్వంత్ సిన్హా


ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నియమితులయ్యే అవకాశాలున్నాయి. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖనూ చేపట్టిన యశ్వంత్ సిన్హా గడచిన లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీకి దిగకుండా, తన కుమారుడు జయంత్ సిన్హాను హజారీభాగ్ నుంచి బరిలోకి దింపి గెలిపించుకున్న సంగతి తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన యశ్వంత్ సిన్హా, తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పటిదాకా కొనసాగిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడితో పాటు సంఘం సభ్యులు కూడా రాజీనామా చేశారు. దీంతో రెండు నెలలకుపైగా ప్రణాళిక సంఘంలో పదవులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యులను కూడా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి యశ్వంత్ సిన్హాతో పాటు ఎస్ కే సింగ్, అరుణ్ శౌరీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన యశ్వంత్ సిన్హాకే పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News