: మెట్రో రైలు పనులపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాదు మెట్రో రైలు పనుల పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు (బుధవారం) సమీక్ష జరిపారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్, మెట్రో రైల్ ఎండీతో పాటు మంత్రులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మెట్రో రైలు పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, భూసేకరణల్లో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మెట్రో రైలు పరిధిని 200 కిలోమీటర్ల మేర విస్తరించాలని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తో మెట్రో రైలును అనుసంధానం చేయాలని ఆయన అన్నారు. హైదరాబాదులో మెట్రో రైలు ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి తరహాలో పూర్తి చేస్తామని మెట్రో రైలు ఎండీ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, మెట్రో నిర్మాణంలో సమస్యలు ఎదురైతే పరిష్కరించాల్సిందిగా జంటనగరాలకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని ఆయన చెప్పారు.