: మాయావతితో పొత్తుకు సిద్ధమంటున్న ములాయం!
తాజా రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఈ క్రమంలో యూపీలో బీజేపీని ఓడించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. బీహార్ లో జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో రెండు దశాబ్దాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ కలసి ఉమ్మడి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ర్యాలీలో మాట్లాడిన లాలూ, ఆర్జేడీ, జేడీ(యూ) పొత్తు ప్రతి ఒక్కరికీ మంచి సందేశాన్ని పంపుతుందని, బీజేపీని మట్టికరిపించేందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా చేతులు కలపాలని కోరుతున్నానన్నారు. ఇందుకు పైవిధంగా స్పందించిన ములాయం... మాయను లాలూ ఒప్పిస్తే యూపీలో బీఎస్పీతో పొత్తుకు తాను సుముఖంగా ఉన్నానని చెప్పారు. మరి దీనిపై మాయ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.