: మెట్రో రైల్ పనులకు బ్రేక్ వేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు
హైదరాబాద్ మెట్రోరైల్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆదేశాలిచ్చింది. అక్టోబర్ లో జరగనున్న అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సుకు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా... మెట్రో పనులను కొన్నాళ్ల పాటు ఆపాలని జీహెచ్ఎంసీ హైదరాబాద్ మెట్రోరైల్ అథారిటీని ఆదేశించింది. అక్టోబర్ 6 నుంచి 10 వరకు హైదరాబాద్ లో మెట్రోపొలిస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి 60 దేశాల నుంచి సుమారు 2వేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మెట్రోపొలిస్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచడానికి... అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను షోకేస్ చేయడానికి ఈ సదస్సును ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ లోని 22 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీకి కేటాయించింది. వీటిలో భాగంగానే ఈ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడం, రోడ్లను విస్తరించడం, గుంటలను పూడ్చడం, రోడ్లపై మార్కింగ్ లు చేయడం, రంగులు వేయడం, ఫుట్ పాత్ లు అభివృద్ధి చేయడం, రోడ్ల మీద లైటింగ్ సౌకర్యాలను పెంచడం మరియు హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలకు కొత్త వన్నెలు అద్దడం లాంటి పనులను జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఈ పనులు చేయడానికి మెట్రో రైల్ పనులు ఆటంకంగా ఉంటాయని భావించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, మెట్రోపనులు చేయడానికి రోడ్లపై ఉన్న యంత్రాలు, సామగ్రిని తొలగించాలని... బారికేడ్లను ఎత్తివేయాలని జీహెచ్ఎంసి ఆదేశించింది. అయితే తాము సూచించిన ప్రాంతాలు మినహాయించి... మిగతా ప్రాంతాల్లో మెట్రో పనులు యథాప్రకారంగా చేసుకోవచ్చని మెట్రో అధికారులకు సర్కారు సూచించింది.