: హర్యానా ఎన్నికలకు గురిపెట్టిన మోడీ!
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రికార్డు మెజార్టీ సాధించిపెట్టిన మోడీ, తాజాగా హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. హర్యానాలో ఎలాగైనా అధికారం చేపట్టాల్సిందేనన్న దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా సర్కారు పదేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. పదేళ్ల పాలనలో హుడా సర్కారు, తాను చెప్పినట్లు వినని అధికారులను నానా ఇబ్బందులకు గురిచేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ ఆస్తుల వ్యవహారం కూడా హర్యానాలోనే వెలుగు చూసింది. హుడా సర్కారుపై వెల్లువెత్తిన ఆరోపణలనే ఆధారం చేసుకుని విజయం సాధించాలని సంకల్పించిన మోడీ, ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 11 రోజుల పాటు విజయ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. 23 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జరగనున్న ఈ యాత్రలో మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాలుపంచుకోనున్నారని పార్టీ వర్గాల సమాచారం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఏడింటిని కైవసం చేసుకుంది. అంతేకాక 90 అసెంబ్లీ స్థానాల పరిధిలో నమోదైన ఓటింగ్ లోనూ తన వాటాను 17.21 నుంచి 34.6 శాతానికి పెంచుకుంది. 50 అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రెస్ కంటే మెజార్టీ సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన మోడీ, రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరి హుడా, మోడీ దాడిని ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.