: భారత్ లో వేళ్లూనుకుంటున్న ఐఎస్ఐఎస్ నెట్ వర్క్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా... క్లుప్తంగా ఐఎస్ఐఎస్. ఇప్పుడీ నెట్ వర్క్ శరవేగంగా భారత్ లో విస్తరిస్తోంది. ఉత్తర ఇరాక్ తో పాటు సిరియాలోనూ బలవంతంగానైనా అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాలని భావించిన అతివాదుల సమాహారమే ఐఎస్ఐఎస్. 11 ఏళ్ల క్రితం ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన అమెరికా, తాజాగా మళ్లీ తన సైన్యంతో విరుచుకుపడటానికి ఈ సంస్థే కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లిన ముస్లిం యువకులకు వల వేసిన ఈ సంస్థ, వారిని తమ దళంలో చేర్చుకుంది. తమిళనాడు నుంచి సింగపూర్ వెళ్లిన ఓ యువకుడు, తాను ఐఎస్ఐఎస్ లో చేరానని, అందుకు గర్వంగా ఉందని ఇటీవల తన తల్లిదండ్రులకు పంపిన సందేశం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాక ముంబైలోని ఓ వ్యాపారి, నగరంలోని యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు దేశంలో విస్తృతమవుతున్నాయన్న అనుమానాలకు ఊతమిచ్చేలా, ఆ సంస్థ పోస్టర్లు పలు ప్రాంతాల్లో వెలిశాయి. అంతేకాక ఇంటర్నెట్ లో సంస్థ ప్రచారం శరవేగంగా దూసుకుపోతోంది. సంస్థ తన కార్యకలాపాలతో పాటు తన లక్ష్యాలను కూడా హిందీలో తర్జుమా చేసి మరీ నెట్ లో పెట్టింది. ఈ సమాచారం ప్రస్తుతం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక, ఈ సంస్థ ఇటీవల నెట్ లో పెట్టిన ఓ వీడియోకు హిందీ వ్యాఖ్యానం కూడా తోడైంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ తన కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు, బలగాన్ని పెంచుకునేందుకు భారత్ ను కేంద్రంగా చేసుకునేందుకు యత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో పెద్ద సంఖ్యలో భారత పౌరులు ఈ సంస్థ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.