: కొలీజియం రద్దు బిల్లుకు కాంగ్రెస్ మద్దతు


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొత్తగా తీసుకురానున్న చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో 20 ఏళ్లకు పైగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న ఈ బిల్లు, ఎట్టకేలకు చట్టంగా రూపొందేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటిదాకా జడ్జీలను నియమించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం పేరిట ఓ కమిటీ పని చేస్తోంది. అయితే పలు నియామకాల సందర్భంగా కొలీజియం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆరుగురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ అపాయింట్ మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్ సభ ముందుకు వచ్చిన ఈ బిల్లుకు మద్దతివ్వాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభ్యులను కోరారు. ముసాయిదా బిల్లులో చేయాల్సిన మార్పులేమైనా ఉంటే, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటించారు. దీనికి మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ అంగీకరించడంతో ఇక ఆటంకాలన్నీ తొలగిపోయినట్టుగానే భావించవచ్చు. రాజ్యాంగ సవరణ ద్వారా రానున్న ఈ చట్టాన్ని సవరించేందుకు ఇకపై అధికారంలోకి వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మోడీ సర్కారు చెబుతోంది. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంతో పాటు మొన్నటికిమొన్న మన్మోహన్ సింగ్ సర్కారు కూడా ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో ఆ రెండు ప్రభుత్వాలు ఇందులో సఫలీకృతం కాలేకపోయాయి.

  • Loading...

More Telugu News