: సెల్ఫీ మోజు జంట ప్రాణం తీస్తే... మరో ఇద్దర్ని అనాధలుగా మార్చింది
సాంకేతిక ప్రపంచంలో సామాజిక అనుసంధాన వెబ్ సైట్లు కొత్త రకాల మోజులు పెంచుతున్నాయి. తాజాగా సెల్ఫీ ఓ పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చింది. కూర్చున్న చోట ఫోటో దిగడం... దానికో క్యాప్షన్ పెట్టడం... అదేదో ఘనకార్యం అన్నట్టు సైట్లో అప్ లోడ్ చేయడం... అంతే! తర్వాత దానికి వచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. సెల్ఫీ మోజు ఓ జంట ప్రాణాలు తీసింది. పోర్చుగల్ కు చెందిన ఓ జంట కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. లిస్బన్ కు సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కాబోడే రోకా కొండ ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. సెల్ఫీ తీసుకుంటూ వారు మృతి చెందారని పోలీసులు తెలిపారు. అంతకంటే హృదయవిదారకమైన సంగతేంటంటే ఆ జంటకు ఐదు, ఆరేళ్ల వయసుగల పిల్లలు ఉన్నారు. వారి కళ్ల ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు.