: కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు... అన్నా డీఎంకేను మచ్చిక చేసుకుంటున్న మోడీ సర్కార్


కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు మోడీ ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్ కు రంగం సిద్ధం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా తో పాటు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎంత డిమాండ్ చేస్తున్నప్పటీకీ... ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ విషయంతో పాటు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని భాజాపా సర్కార్ నిశ్చయించుకుంది. సాధారణంగా అయితే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షానికే డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెడతారు. అయితే ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కావాల్సిన సీట్ల సంఖ్యను ఏ పార్టీ దక్కించుకోలేదు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి 55 సీట్లు అవసరం కాగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిపాలై కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ క్రమంలో, ఎన్డీఏ సర్కార్ కొత్త ఆలోచన చేస్తోంది. 37 మంది ఎంపీలతో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అతి పెద్ద పార్టీగా అన్నాడీఎంకే అవతరించింది. అలాగే, కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగే విధంగా ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జయలలితను మంచి చేసుకునేందుకు... లోక్ సభ ఉప సభాపతి పదవిని ఆ పార్టీకి ఇచ్చేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. జయలలిత అంగీకరించిన పక్షంలో ఉపసభాపతి పదవిని సీనియర్ ఎంపీ తంబిదురైకు ఇవ్వాలని మోడీ సర్కార్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం తంబిదురైకు ఉంది. గతంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అలాగే, యూపీఏ హయాంలో ప్రొటెం స్పీకర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. బీజేపీ అన్నాడీఎంకేను మంచి చేసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. లోక్ సభలో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో మాత్రం లేదు. దీంతో ఏదైనా కీలక బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే, మిగతా పార్టీల అవసరం కూడా బీజేపీ సర్కార్ కు ఉంది. రాజ్యసభలో 11 మంది ఎంపీలను అన్నాడీఎంకే కలిగి ఉంది. ఈ దృష్ట్యా ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు కమలనాధులు ఈ స్కెచ్ వేశారు.

  • Loading...

More Telugu News