: ఆల్ఫా న్యూమరికల్ టైమర్ తో... హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కు చెక్!
హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఇకపై నిమిషాల తరబడి నిలిచిపోవాల్సిన దురవస్థకు చెక్ పడనుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఆల్ఫా న్యూమరికల్ సిగ్నళ్ల ఏర్పాటుతో ఈ అవస్థ నుంచి మనకు ట్రాఫిక్ పోలీసులు విముక్తి కల్పించనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సీవీ ఆనంద్ చేపట్టిన సంస్కరణలు తాజాగా మనలను ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించనున్నాయి. తాజా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటయ్యే ఆల్ఫా న్యూమరికల్ టైమర్లు, వాహన శ్రేణి లేని రూట్ కు రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వాహనాల క్యూ ఉన్న మార్గానికి గ్రీన్ సిగ్నల్ ను ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. దీంతో 90 శాతం ట్రాఫిక్ అంతరాయాలకు చెక్ పడినట్టే. ఇప్పటికే ఈ టైమర్లను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ధ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. దీంతో నగరంలోని 221 ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆల్ఫా న్యూమరికల్ టైమర్లను అమర్చేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.