: సీఎం, మంత్రుల ఆస్తుల చిట్టాను వెల్లడించలేం: గుజరాత్ సర్కారు


ఊరందరిదీ ఒకదారైతే, ఉలిపిరి కట్టెది మరో దారన్నట్లుంది గుజరాత్ ప్రభుత్వ తీరు. ముఖ్యమంత్రితో పాటు తమ కేబినెట్ మంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించలేమని తేల్చిచెప్పింది. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడి చేయాల్సిందేనని సమాచార హక్కు చట్టం చెబుతోంది. అంతేనా, దేశ ప్రధాని సహా కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు కూడా తమ ఆస్తులను వెల్లడిస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి కూడా ఎన్నికల సంఘానికి తన ఆస్తుల చిట్టాను అందించాల్సిందే. దీనిపై అన్నా హజారే లాంటి సామాజిక ఉద్యమకారులు చేసిన ఉద్యమాలు ఫలించి, ఏకంగా లోక్ పాల్ చట్టానికే పార్లమెంట్ ఆమోద ముద్రం వేసింది. ఇక గుజరాత్ కు నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్ర మోడీ నినాదమే అవినీతి నిర్మూలన. దేశ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఖాళీ చేసిన స్థానంలో కూర్చున్న ఆనందిని బెన్ సర్కారు మాత్రం నరేంద్ర మోడీ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాల వెల్లడి, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించేదేనని, అంతేకాక సమాచారం కోరిన వ్యక్తికి ఈ వివరాలతో సంబంధం లేదని వితండవాదం చేస్తోంది. అంతేకాదండోయ్, ఆ వివరాల వెల్లడితో అనవసర రాద్ధాంతం కూడా జరిగే ప్రమాదం ఉందని సూత్రీకరించింది. దీనిపై కేంద్ర మాజీ ముఖ్య సమాచార కమిషనర్ హబీబుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని వితండ వాదం చేయడం గుజరాత్ కు తగదని కూడా ఆయన ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News