: హిట్లర్ ‘పొట్టి’ మీసకట్టుకు కారణం ఏమిటంటే?
హిట్లర్. అత్యంత క్రూరుడు. నాడూ, నేడూ అందరిదీ ఇదే అభిప్రాయం. మరి తన గాంభీర్యానికి తగ్గట్టు మీసకట్టు లేదేమిటబ్బా? అనేది కూడా అందరి మదినీ సంశయంలో ముంచేయడమూ తెలిసిందే. గాంభీర్యంగా ఉండే హిట్లర్ ను ‘పొట్టి’ మీసకట్టులో చూసే ఎవరికైనా కమెడియనే గోచరిస్తారు. అసలు అంత గంభీరంగా ఉండే హిట్లర్ పొట్టి మీసకట్టును ఎందుకు ఎంచుకున్నారు? తాను ఎత్తులో పొట్టిగా ఉండటమే కారణమా? కానే కాదంటోంది హిస్టరీ ఛానెల్. చరిత్ర కారులు, రాజకీయ వేత్తలు, విశ్లేషకులతో ఆరు గంటల పాటు నిర్వహించిన చర్చాగోష్టిలో భాగంగా ఇతమిద్ధమైన కారణమైతే చెప్పలేదు కాని, ఈ రెండు కారణాలే దారి తీసి ఉండవచ్చని అంచనా వేసింది. హిట్లర్ కూడా తొలుత పొడుగాటి మీసాలతోనే ఉండేవారట. పలువురితో చర్చల సందర్భంగా తన పొడుగాటి మీసాలను మెలేస్తూ మాట్లాడేవారట. అయితే సైన్యంలో ఉండగా, గ్యాస్ మాస్క్ ధరించే సమయంలో తన పొడుగు మీసాలు ఆయనను ఇబ్బంది పెట్టేవట. అయితే అందరిలా చిన్న పొడవు మీసాలతో కనిపిస్తే, తన ప్రత్యేకతేముంటుంది అన్న క్రమంలో అందరిలోకి తాను ప్రత్యేకంగా కనిపించాల్సిందేనని, మీసకట్టును మనం చూస్తున్నట్లుగా చతురస్రాకారంలో కత్తిరించుకుని, దానినే కంటిన్యూ చేశారనేది ఓ కారణమట. అయితే తొలి ప్రపంచ సంగ్రామంలో ప్రసిద్ధి చెందిన పొట్టి మీసకట్టును హిట్లర్ కూడా అనుకరించాడనేది రెండో కారణంగా హిస్టరీ అంచనా వేసింది. ఏమైతేనేం కఠినాత్ముడిగా పేరుగాంచిన హిట్లర్ మీసకట్టులోనైనా కమెడియన్ గా కనిపించేశారు.