: హైదరాబాదును యూటీ చేసే ప్రయత్నం జరుగుతోంది: సురవరం సుధాకర్ రెడ్డి
రాష్ట్రాల పాలన, సార్వభౌమాధికారంలో కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదును యూటీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని... రెండు ప్రభుత్వాలు కూర్చొని, మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పట్టువిడుపులు లేకపోతే తెలుగు ప్రజలు మరింత నష్టపోతారని తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెండు ప్రభుత్వాలు ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో సాగుతున్నాయని... ఈ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. సోమవారం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన... పైవిధంగా వ్యాఖ్యానించారు.