: సిండికేట్ బ్యాంక్ స్కాం... రూ.8 వేల కోట్ల ముడుపులు!
సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఇరుక్కున్న లంచం కేసులో తవ్వే కొద్దీ ఆశ్చర్యగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత ఏదో ఒకటి, రెండు కోట్ల రూపాయల మేర అవినీతి ఆరోపణలు మాత్రమే వినిపించినప్పటికీ, తాజాగా ఇదే తరహాలో ఇతర బ్యాంకులు మంజూరు చేసిన రుణాల్లో 8,000 కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాక, ఇందులో సిండికేట్ బ్యాంక్ ఒక్కటే కాక పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీబీఐ అధికారులకు లభించినట్లు సమాచారం. కార్పొరేట్ సంస్థలకు భారీ రుణాలు మంజూరు చేయించడంలో కీలక భూమిక పోషిస్తున్నట్లు భావిస్తున్న పవన్ బన్సల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయట. సిండికేట్ బ్యాంకుతో పాటు కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల నుంచి కూడా పలు కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించినట్లు బన్సల్ ఒప్పుకున్నారట. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయా కార్పొరేట్ సంస్థలు బ్యాంకు అధికారులకు ముడుపులు ముట్టజెప్పాయని కూడా ఆయన వెల్లడించాడు. బన్సల్ చెప్పిన విషయాలపై ఆరా తీసిన క్రమంలో కొన్ని ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థకు లభించాయి. బన్సల్ నడుపుతున్న అల్టియూస్ ఫిన్ సర్వ్ లిమిటెడ్, రుణాలు పొందిన సంస్థల నుంచి వసూలు చేసిన ఫీజులో కొంతభాగం బ్యాంకు అధికారులకు లంచాల రూపంలో వెళ్లిందన్న విషయానికి సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు లభించాయని ఓ సీబీఐ అధికారి వెల్లడించారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పారు.