: నేడు కాశ్మీర్ లో మోడీ పర్యటన


భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి కాశ్మీర్ లో పర్యటిస్తున్న మోడీ, భారీ విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటుగా వాజ్ పేయి ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సరఫరా మార్గాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సరఫరా మార్గంతో ఉత్తర గ్రిడ్ తో లడఖ్ అనుసంధానమవుతుంది. కాశ్మీర్లో ప్రస్తుతం 3,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అందులో కేవలం సగం మేర మాత్రమే లభ్యమవుతోంది. దీంతో కాశ్మీర్ లోని మెజార్టీ ప్రాంతాలకు భారీ విద్యుత్ కోతలు తప్పడం లేదు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో కలిసి జరుపుతున్న ఈ పర్యటనలో భాగంగా మోడీ, లేహ్ పరిధిలోని నిమూబగ్జూ వద్ద 45 మెగావాట్లు, కార్గిల్ జిల్లా పరిధిలోని చుటక్ లో 44 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ పర్యటన బీజేపీకీ లాభించేలానే ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గడచిన ఎన్నికల్లో భాగంగా బీజేపీ తొలిసారిగా లడఖ్ పార్లమెంట్ సీటును గెలుచుకుంది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తప్ స్తన్ ఛెవాంగ్ కేవలం 36 ఓట్లతో విజయం సాదించారు. మరోవైపు మోడీ పర్యటన తమ ప్రాంతంలో వెలుగులు నింపనుందని లడఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ రిగ్జిన్ స్పాల్బార్ ఆశాభావం వ్యక్తం చేశారు. లడఖ్ కు కేంద్ర పాలిత హోదా ఇస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందని తాము విశ్వసిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News