: పసిఫిక్ మహాసముద్రంలో 'కెప్టెన్ సచిన్' సాహసం


సముద్రంలో ఓ మోస్తరు అల్పపీడనం ఏర్పడితేనే అలల ఉద్ధృతిని తట్టుకోలేం. అదే, తుపాను అయితే ఇక చెప్పనక్కర్లేదు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో నోయిడాకు చెందిన మెరైనర్ కెప్టెన్ సచిన్ శ్రీవాత్సవ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వీడిష్ దంపతులను రక్షించారు. వివరాల్లోకెళితే... స్వీడన్ కు చెందిన స్టిగ్ (70), సివ్ బోడిన్ (69) లు దంపతులు. 2011 నుంచి వారు సముద్రయానం చేస్తున్నారు. తమ బోటు సాయంతో వారు పలు దేశాలు, ద్వీపాలను సందర్శిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ అధీనంలోని పోలినేషియా దీవుల్లో పర్యటించాలని అనుకున్నారు. తహితీ ద్వీపహారంలోని పపీటే ప్రాంతానికి వెళ్ళాలని భావించగా, అనుకోనిరీతిలో దారితప్పారు. పసిఫిక్ మహాసముద్రం దక్షిణభాగం ఆ సమయంలో అల్లకల్లోలంగా ఉండడమే అందుక్కారణం. వారి బోటు భారీ తుపానులో చిక్కుకోవడంతో అందులోని నావిగేషన్ వ్యవస్థ మొరాయించింది. ఆ విశాల మహాసముద్రంలో ఎక్కడున్నారో కూడా తెలియని స్థితి! అదే సమయంలో ఈ స్వీడిష్ దంపతుల బోట్ కు 150 నాటికల్ మైళ్ళ దూరంలో 'స్టెనా పారిస్' అనే టాంకర్ నౌక ప్రయాణిస్తోంది. దాని కెప్టెన్ సచిన్ శ్రీవాత్సవ. బోట్ దారితప్పిన విషయం మేరిటైం అధికారుల ద్వారా తెలుసుకున్న సచిన్ మరేమీ ఆలోచించకుండా తన నౌకను దారిమళ్ళించాడు. బోట్ ఉన్న దిక్కులో మాగ్జిమం స్పీడ్ తో నౌకను ఉరికించాడు. మొత్తం 13 గంటల పాటు ఆ ప్రతికూల తుపాను పరిస్థితులను సైతం లెక్కచేయకుండా నౌకను నడిపించి, ఎట్టకేలకు ఆ వృద్ధులను కాపాడాడు. సిబ్బంది సాయంతో వారిని సురక్షితంగా తన నౌక డెక్ పైకి చేర్చాడు. కాగా, సచిన్ తను చేసిన మంచి పని గురించి తండ్రి దీపక్ శ్రీవాత్సవకు శాటిలైట్ ఫోన్ ద్వారా తెలిపాడు. దీనిపై సచిన్ తల్లి మాట్లాడుతూ, ఆ సాహసం గురించి వినగానే భయంవేసినా, ఆ తర్వాత గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో సచిన్ భారత్ వస్తాడని తెలిపారు.

  • Loading...

More Telugu News