: అక్కడ అమ్మాయిలకు ఎన్ని కష్టాలో... జీన్స్ లు, మొబైల్ ఫోన్లు వాడరాదట!
దేశంలో ఛాందసవాదం తొలగిపోలేదనడానికి ఈ గ్రామపెద్దల తీర్పే సాక్ష్యం. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా జాగ్వాడ్ గ్రామంలో మహిళలపై అత్యాచారాలు, దాడుల వంటి అరాచకాలను రూపుమాపాలని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే, ఈ అంశంపై చర్చించేందుకు గ్రామపెద్దలు, స్థానిక గుజ్జర్ సమాజ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. తీవ్రంగా చర్చించిన మీదట... అవివాహిత యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామంలో ప్రకటించారు కూడా. మద్యం అమ్మకాలపైనా నిషేధం విధించారు. ఈ సందర్భంగా గుజ్జర్ కమిటీ సభ్యుడొకరు మీడియాతో మాట్లాడుతూ, జీన్స్ తమ సంప్రదాయానికి విరుద్ధమని తెలిపారు. అయితే, వివాహిత స్త్రీలు మొబైల్ ఫోన్లు వాడొచ్చని చెప్పారు. కాగా, ఈ తీర్మానాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కట్టుబాట్లతో మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.