: లేడీ ఎస్సైతో షారూఖ్ డ్యాన్స్... మండిపడుతున్న బెంగాల్ విపక్షాలు
కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ యూనిఫాంలో ఉన్న ఓ మహిళా పోలీసు అధికారితో డ్యాన్సు చేయడంపై పశ్చిమబెంగాల్ విపక్షాలు మండిపడుతున్నాయి. సినిమా తారలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం మమతా బెనర్జీకి చురకలంటించారు. శనివారం రాత్రి జరిగిన కోల్ కతా పోలీస్ వార్షిక సాంస్కృతికోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ సంపా హల్దార్ ను రెండు చేతులతో పైకెత్తుకుని మరీ చిందులేశారు. తన బ్లాక్ బస్టర్ మూవీ 'జబ్ తక్ హై జాన్' లోని ఓ హిట్ గీతానికి షారూఖ్ ఈ ఎస్సైతో కలిసి ఎంతో హుషారుగా నర్తించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా స్పందించారు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారితో డ్యాన్సులేయించడం ద్వారా సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని దుయ్యబట్టారు. ఈ చర్య సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఎలాంటి వ్యాఖ్య చేశారో చూడండి. అసలు మమతా బెనర్జీ రాజకీయాల్లోకి రావడమే పెను తప్పిదమని తేల్చేశారు. "ప్రతి కార్యక్రమానికి మమత ఫిలిం స్టార్లను పిలవడం చూస్తుంటే, ఆమె పొరబాటున రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆమె త్వరలోనే అర్థం చేసుకుని పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారు. బెంగాల్ ప్రజలకు అదే మేలు" అని సిన్హా అభిప్రాయపడ్డారు. ఇక, మాజీ పోలీస్ కమిషనర్ నిరుపమ్ సోమ్ మాట్లాడుతూ, ఆ మహిళా ఎస్సై యూనిఫాంలో ఉండగా డ్యాన్సులేయడం సరికాదన్నారు. తద్వారా యూనిఫాం పవిత్రతను కించపరిచినట్టయిందని అభిప్రాయపడ్డారు. మరో పోలీసు అధికారి సమీర్ గంగోపాధ్యాయ మాట్లాడుతూ, యూనిఫాంలో ఉండగా నర్తించడానికి పోలీసు చట్టాలు అంగీకరించవని తెలిపారు.