: మమత దెబ్బకు హడలిపోతున్న 'ఎర్ర'నేతలు!
పశ్చిమబెంగాల్ ను, వామపక్ష భావజాలాన్ని వేరుచేసి చూడలేం. ఏళ్ళుగా ఆ రాష్ట్రం కమ్యూనిస్టుల ఏలుబడిలో ముందుకు సాగింది. అక్కడ ఓ వెలుగు వెలిగిన 'ఎర్ర' నేతలు ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ అంటే ఉలిక్కి పడుతున్నారు. వచ్చే ఏడాది జరుపతలపెట్టిన సీపీఎం మహాసభల వేదికను కోల్ కతా నుంచి విశాఖకు మార్చాలని నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రెండ్రోజుల పాటు జరిగిన పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మమత వైఖరిపై తీవ్రంగా చర్చించారట. కోల్ కతా వేదికగా పార్టీకి చెందిన ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా దీదీ అడ్డుపడుతోందని వారు అభిప్రాయపడ్డారు. తాము మహాసభల తేదీని ప్రకటిస్తే, మమత అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ఖాయమని వారు భయపడుతున్నారు. అంతేగాకుండా, గతంలో తమ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడాన్ని సీపీఎం నేతలు గుర్తుచేసుకున్నారు.