: పవన్ కల్యాణ్ 'పిడికిలి' ఆగస్ట్ 15కి రావడం లేదు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని... ఆగస్టు 15వ తేదీన జనసేన పార్టీ గుర్తు 'పిడికిలి'ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. ఈ మేరకు మీడియాకు జనసేన వర్గాలు అనధికారికంగా సమాచారం కూడా అందించాయి. అయితే, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో జనసేన వర్గాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు కనబడుతోంది. ఈ నెల 23 లోపు జనసేన పార్టీ నమోదుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ నెల 23 తర్వాతే జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే... పార్టీ గుర్తును విడుదల చేస్తే బాగుంటుందని పవన్ అండ్ టీం ప్రస్తుతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ వాయిదాపడినట్టేనని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనసేన పార్టీ క్రియాశీల రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొననుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా తొలిసారి రాజకీయ కదనరంగంలోకి దిగాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం.