: విద్యార్థి కణతపై ఉపాధ్యాయుడి తుపాకీ


ఊరెళుతూ ఒంటరిగా ఉన్న పిల్లాడి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఓ సెల్ ఫోన్ ఇచ్చి వెళ్లారు. యథాలాపంగా దానిని ఆ విద్యార్థి స్కూల్ కు తీసుకెళ్లాడు. అక్కడ అది చోరీకి గురైంది. ఎవరు తీశారో తెలిసింది. అయితే బాధిత విద్యార్థి, చోరీ విద్యార్థి తల్లిదండ్రుల మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో సెల్ ఫోన్ యజమానుల వద్దకే చేరింది. సమస్య అక్కడితో సమాప్తమైంది. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య. ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని పాఠశాల ఉపాధ్యాయుడికి మాత్రం పట్టరాని కోపమొచ్చింది. ఎందుకంటే, ఆయనకు తెలియకుండా విద్యార్థుల తల్లిదండ్రులు రాజీ పడ్డందుకంట. కోపంతో ఊగిపోయిన ఆ ఉపాధ్యాయుడు సెల్ ఫోన్ పోగొట్టుకున్న విద్యార్థిని చితకబాదాడు. మీ తల్లిదండ్రులను పిలుచుకు రావాల్సిందేనని హుకుం జారీ చేశాడు. మరునాడు తల్లిదండ్రులను తీసుకురాని విద్యార్థి వీపును మళ్లీ విమానం మోత మోగించి, కోపం చల్లారక నిత్యం వెంట ఉండే పిస్టల్ తీసి విద్యార్థి కణతకు గురి పెట్టేశాడు. కాల్చలేదు కాబట్టి సరిపోయింది కాని, లేకపోతే పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ ఘటన శుక్రవారం లుధియానాలోని కృష్ణా కాన్వెంట్ స్కూల్ లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి పేరు గౌతం రాజ్ పుత్ కాగా, అతడి కణతకు తుపాకీ గురిపెట్టిన కర్కోటక ఉపాధ్యాయుడి పేరు భూపీందర్ సింగ్. తలకు తుపాకీ గురి పెట్టడంతో వణికిపోయిన గౌతం, విషయాన్ని ఇంట్లో చెప్పాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం కాస్త దూరంగానే వెళుతోందని గ్రహించిన పాఠశాల యాజమాన్యం భూపీందర్ ను విధుల నుంచి తప్పించింది. తన దాష్టీకం పోలీసుల దాకా వెళ్లిందని గ్రహించిన భూపీందర్, అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. అసలు తుపాకీతో వచ్చే భూపీందర్ ను పాఠశాల ఆవరణలోకి ఎలా అనుమతించారంటూ పాఠశాల యాజమాన్యాన్ని విద్యా శాఖ వివరణ కోరడంతో పాటు చర్యలకూ రంగం సిద్ధం చేసింది. ఇదే విషయంపై పోలీసులు కూడా భూపీందర్ ను వెతుకుతూనే, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారట.

  • Loading...

More Telugu News