: ఆ మూడు సందర్భాల్లోనే మోడీ సర్కారు కీలక ప్రకటనలు!
స్పష్టమైన మెజార్టీతో విజయ పతాకాన్ని ఎగరేసి ఢిల్లీ గద్దె ఎక్కిన మోడీ సర్కారు, తన కీలక ప్రకటనలు చేసేందుకు మూడు సందర్భాలను ఎంచుకుందని అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి తొలిసారిగా మోడీ చేసే ప్రసంగం, ఈ మూడు సందర్భాలల్లో మొదటిదిగా భావిస్తున్నారు. అత్యంత ఉత్తేజపూరితంగా సాగనున్న మోడీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలకు తెరలేపనుందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా దేశంలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాక ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేని 15 కోట్ల మందికి కొత్తగా ఖాతాలను తెరవాలన్న ప్రకటన ఉండనుందని సమాచారం. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపైనా మోడీ ప్రకటన చేస్తారని వినికిడి. ఇక రెండో సందర్భంగా మోడీ సర్కారు వంద రోజుల పాలనను పూర్తి చేసుకునే సెప్టెంబర్ 3ను, జనసంఘ్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినమైన సెప్టెంబర్ 25ను మూడో సందర్భంగాను అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూడు సందర్భాల్లో మోడీ సర్కారు, తాను చేపట్టాలనుకుంటున్న ప్రధాన పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని సదరు వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే మరో నాలుగు రోజుల్లో కేంద్రం కొత్త పథకాలను ప్రారంభించడం ఖాయంగానే కనిపిస్తోందన్నమాట.