: హమ్మయ్యా... ప్రస్తుతానికి ఎబోలా ముప్పు తప్పింది!
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఎబోలా భయంతో భారతీయులు ఆదివారం భయంతో వణికిపోయారు. ప్రాణాంతక వ్యాధి సోకిన ఓ వ్యక్తి దేశంలోకి ప్రవేశించాడన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎబోలాలో చిక్కుకున్న దేశం గినియా నుంచి చెన్నై చేరుకున్న ఓ యువకుడిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్న వార్త నేపథ్యంలో అందరి దృష్టి అటువైపుగానే వెళ్లింది. అయితే అతడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడని, అతడికి ఎబోలా సోకలేదని సోమవారం తెల్లవారుజామున వైద్యులు తేల్చారు. దీంతో అటు తమిళనాడు సర్కారుతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఊపిరి పీల్చకున్నాయి. గినియా నుంచి ఈ నెల 9న చెన్నై చేరుకున్న సదరు యువకుడికి ఎబోలా ఉందని పలు మీడియాలో జరిగిన ప్రచారంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మండిపడ్డారు. విషయం తెలుసుకోకుండా చేసే ఈ తరహా ప్రచారం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతారన్న విషయాన్ని మీడియా గుర్తించాలని కూడా ఆయన సూచించారు. విదేశాల నుంచి దేశానికి వచ్చే వారికి ఎబోలా సోకిందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించడంతో పాటు వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తాము, విదేశీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖలు కలసి సమన్వయంతో పనిచేస్తున్నామని, ఎవరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు.