: జైలు నుంచే ఆస్తుల విక్రయానికి సహారా చీఫ్ యత్నం
సహారా చీఫ్ సుబ్రతో రాయ్ జైలు నుంచే తన ఆస్తుల విక్రయానికి పూనుకున్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టు నిర్దేశించిన మొత్తాన్ని సేకరించేందుకు జైలులో ఉండగానే తనకు వెసులుబాటు కల్పించాలన్న రాయ్ అభ్యర్థనకు ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో రాయ్, ఆయన ఇద్దరు సహాయకులకు తీహార్ జైలులో ఓ ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ గదికి మారిన రాయ్, లండన్, న్యూయార్క్ లోని విలువైన ఆస్తులను విక్రయించేందుకు రంగంలోకి దిగారు. తనకు కేటాయించిన ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సహాయంతో రాయ్, ఇప్పటికే పలువురితో మాట్లాడారు. అంతేకాక రాయ్ విక్రయించనున్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న పలువురు ఆయనను కలిసినట్లు జైలు వర్గాల సమాచారం. రాయ్ విక్రయించనున్న ఆస్తుల జాబితాలో న్యూయార్క్ లోని విలాసవంతమైన హోటల్ తో పాటు అదే నగరంలోని మరో ఆస్తి కూడా ఉంది. లండన్ లోని మరో విలువైన ఆస్తిని కూడా రాయ్ విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పదిరోజుల్లోగా రూ.10 వేల కోట్లను పూచీకత్తుగా చెల్లించాలని, లేనిపక్షంలో కనీసం బ్యాంకు గ్యారెంటీనైనా ఇవ్వాలని సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికే రాయ్, బెయిల్ వరకు అవసరమైన మొత్తాన్ని సేకరించేసినట్లేనని జైలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి గడువు చివరి రోజునైనా రాయ్, కోర్టు చెప్పిన మేరకు బెయిల్ పూచీకత్తును సమర్పిస్తారో, లేదో చూడాలి!