: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం


ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరగనున్న ఈ భేటీలో మంత్రుల పనితీరుకు సంబంధించిన అంశం కీలకంగా చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రత్యేకంగా నివేదికలను సీఎం కోరిన సంగతి తెలిసిందే. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ నేపథ్యంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ నివేదికలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసమంటూ ఏర్పాటు చేసిన ఏడు మిషన్లపైనా ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశముంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, శాసనసభ సమావేశాలు తదితరాలపైనా సమీక్ష జరగనుంది. ఇక ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా రాష్ట్రంలో కలిసిన ఏడు మండలాలకు మరిన్ని మండలాలను కలిపి కొత్తగా ఏర్పాటు చేయనున్న రంపచోడవరం జిల్లాపైనా ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజధాని, హైదరాబాద్ లో గవర్నర్ పాలన తదితర అంశాలపైనా మంత్రి మండలి దృష్టి సారించనుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ పై తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News